Tag: language

తెలుగు భాషా ఉనికిని కాపాడుకునేందుకు ఏమి చేయాలి?

మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాము. అంతర్జాల వినియోగం బాగా పెరిగిపోయింది. కృత్రిమ మేధస్సు ద్వారా ఎన్నో కష్ఠతరమైన సమస్యలను సాధించగలుగుతున్నాము. కానీ మన మాతృభాషను ఉపయోగించడంలో చాలా వెనకబడిపోయాము. దీనికి కారణము పర భాషను మనపై రుద్దటమే. “W3Tech” అనే వెబసైట్లో అంతర్జాలంలో ఆంగ్ల భాషా 54% ఉంటే హింది 0.1% మాత్రమే ఉంది. ఇక తెలుగు అయితే కేవలం 0.012% మాత్రమే ఉంది.

ఇలా అయితే రాను రాను మన ముందు తరాల వారు తెలుగు వాడకం తగ్గిస్తారేమో అన్న భావన నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. ప్రస్తుతం తెలుగుకి పెద్దగా ముప్పు లేకపోవచ్చు కానీ మనం మేల్కోనడానికి ఇదే సరైన సమయం. అయితే ఇదంతా ప్రభుత్వం వలనే అని చేప్పి మనం తప్పించుకుంటే చేజేతులా తప్పు చేసిన వాళ్ళవుతాం. అయితే, ఈ వ్యాసంలో మనం అంటే నేను లేదా ఈ వ్యాసం చదివే వారు ఎవరు అయినా కావచ్చు, మనమంతా బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తే తెలుగుని ముందు తరాల వారికి మరింత తీయ్యందనంతో అందించిన వారవుతాం.

అందుకోసం మనం చేయ్యవలసిందేంటంటే ఇంట్లో అందరితో తెలుగులోనే మాట్లడడం. ఇది మొదటిది మరియు అన్నింటికంటే ముఖ్యమైనది. రెండవది మన పిల్లల పై ఆంగ్లం లేదా పర భాషాను రుద్దకపోవడం. తెలుగులో మాట్లాడితే తక్కువగా చూసే చులకన భావనను తీసివేయాలి. మనం ఆలోచిస్తే అది మన మాతృభాషలో చేస్తాం కానీ వేరే భాషా లో కాదు. కంప్యూటర్/చరవాణి ఇతరత్రా పరికరాలు వాడినప్పుడు సాధ్యమైనంత వరకు తెలుగును ఉపయోగించాలి. ముఖ్యంగా మనం ఏదైనా సందేశాన్ని సృష్టించినప్పుడు లేదా స్టేటస్లు పేట్టినప్పుడు తెలుగునే వాడాలి.

ప్రస్తుత జీవన విధానంలో సామాజిక మాధ్యమాలను మనమందరం వాడుతున్న వాళ్ళమే. ఈ మాధ్యమాలలో తెలుగుని ఉపయోగిస్తే ఒక మంచి భవిష్యత్తుకు మనం స్రీకారం చుట్టిన వారవుతాం. ఎందుకంటే వీటి వలన సందేశాలను క్షణాల్లో పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక సంచలన వార్త త్వరగా అందరికి చేరుతుంది(వైరల్ అవుతుంది). ఇలాంటి వార్తలను అందరు ఆసక్తితో చదువుతారు. వీటిని మనం తెలుగులో పంచుకోవాలి. మనలో చాలా మందికి తెలుగుని వాడాలని ఉన్నా తెలుగు ఎలా టైపు చెయ్యాలో తెలియక ఆంగ్లాన్ని వాడుతారు. ఈ సమస్యను చిన్న యాప్ ద్వారా మనం దూరం చేస్కోవచ్చు. ఇది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలిజేయాలి.

అలా చేస్తే తెలుగు వినియోగం పెరిగి పర భాషా వినియోగం తగ్గుతుంది. తద్వారా అంతర్జాలంలోనే కాకుండా ప్రపంచానికి తెలుగు ఉనికిని చాటొచ్చు. అలాగే రోజు మనం తెలుగు దినపత్రిక, చందమామ కథలు, వంటి ఆసక్తికరమైన పుస్తకాలు పిల్లలకు అలవర్చితే చిన్నప్పట్నుంచే వారిలో తెలుగుపై ఆసక్తిని పెంచిన వారవుతాం.

ఇలా మన జీవితంలో తెలుగుని ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుంటే, ఇదే అలవాటుతో మనతో పాటు ఉన్నవాళ్ళను కూడా చైతన్యపరచిన వాళ్ళవుతాం. మనం మారితే ప్రభుత్వాలు దిగి రావా? ఇలా జరిగితే ప్రభుత్వాలు తెలుగునే ఉపయోగిస్తాయి. ఒక్కటి మాత్రం ఇక్కడ మనం మరవకూడదు తెలుగుకి మంచి భవిష్యత్తు కల్పించాలంటే మార్పు అనేది ముందుగా మనతోనే మొదలవ్వాలి, ఎందుకంటే వంద అడుగుల దూరం కూడా ఒక్క అడుగుతోనె మొదలవుతుంది.

ధన్యవాదాలు.